NATIONAL

పేపర్ లీక్‌కు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా-కేంద్రం

బళ్లారిగుంతకల్లు మధ్య 3వ,4వ రైల్వే లైన్ల నిర్మాణం..

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన చర్యలు, పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా, ప్రత్యేక చట్టబద్ధతతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కర్ణాటకలోని బళ్లారి-ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు మధ్య 3వ,4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి రూ.1,264 కోట్లతో ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు 2028–29 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా అమలుకానుంది.ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు.

వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో సుమారు 80 శాతం ఇప్పటికే అందుబాటులో ఉందని, మూడేళ్లలో పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 99 గ్రామాలకు రైల్వే అనుసంధానం లభిస్తుందని వెల్లడించారు. రైల్వే సామర్థ్యం పెంపు, రద్దీ తగ్గింపే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే, రూ.3,030 కోట్లతో ‘భవ్య రసాయన’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *