మూడున్నర గంటలపాటు పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స
ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్‌కు…
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణురాలైన డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కల్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు జనసేన పార్టీ పేర్కొంది. భుజంలో అవల్షన్ ఫ్రాక్చర్తోపాటు రోటేటర్ కఫ్ గాయం కూడా కావడంతో, ఈ పెద్ద శస్త్రచికిత్స అవసరమైంది. ఈ శస్త్రచికిత్సకు మూడున్నర గంటల సమయం పట్టింది. ఆయనను ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్‌కు తీసుకువచ్చారు. ఆయన అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని జనసేన పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.
మరో భుజానికి రెండు నెలల్లో:- ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలియచేశారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ మాసంలో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.

