సుమారు 1.27 కోట్ల మంది హిందువులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు-సీ.ఎం యోగీ
అమరావతి: శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల జాబితాల నుండి కోట్ల మంది హిందువుల పేర్లు తొలగిపోయాయని ఆయన వెల్లడించారు. సుమారు 1.27 కోట్ల మంది హిందువులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరినీ తిరిగి జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కిచెప్పారు.
16 కోట్లకు పైగా ఉండాలి:- ప్రస్తుతం యూపీలో సుమారు 13 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అయితే వాస్తవానికి ఆ సంఖ్య 16 కోట్లకు పైగా ఉండాలని సీఎం యోగి తెలిపారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లున్న 66 లక్షల మంది అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో లేరని ఆరోపించారు. దీంతో 28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో బీజేపీ బలహీన పడే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న 55 లక్షల మంది పేర్లు కూడా ఓటర్ల జాబితాలో లేవని విమర్శించారు. అలాగే, 18-19 ఏళ్ల వయసున్న సుమారు 4.5 లక్షల మంది యువత ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోలేదని వెల్లడించారు. గత సర్ ప్రక్రియలో కేవలం నాలుగు లక్షల మందినే కొత్త ఓటర్లుగా చేర్చడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్లందరి పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని, ఇందుకోసం బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సీఎం సూచించారు.
2.04 కోట్ల మంది పేర్లను ఎన్నికల అధికారులు:- ఈ అంశంపై క్రమం తప్పకుండా సమీక్షలూ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా హిందువుల ఓట్లు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులకు అప్పగించారు. సర్ ప్రక్రియ తర్వాత ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి వివిధ కారణాలతో 2.04 కోట్ల మంది పేర్లను ఎన్నికల అధికారులు తొలగించారు. ఈ తొలగింపులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లు తీవ్రంగా ప్రభావితమయ్యారు.

