AP&TG

తీవ్రవాయుగుండంగా మారి, తుపానుగా బలపడే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

సోమవారం సాయంత్రం నాటికి ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని..

40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు..

రానున్న మూడు రోజులు వాతావరణ..

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లోని సుస్పష్టమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు . ఇది ప్రస్తుతానికి శ్రీ విజయపురానికి 330 కి.మీ., నికోబార్‌కు 300 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశలో 1140 కి.మీ. మచిలీపట్నానికి ఆగ్నేయ దిశలో 1200 కి.మీ. దూరంలో  కేంద్రీకృతమైందని వెల్లడించారు.

తుపానుగా బలపడే అవకాశం:- ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.  తదుపరి 12 గంటల్లో ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు. సోమవారం సాయంత్రం నాటికి ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు , కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి  అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు:- ఆదివారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు  40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఎల్లుండి నుంచి 65-85కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని , లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రానున్న మూడు రోజులు వాతావరణ:-

ఆదివారం:- కృష్ణా, గుంటూరు, బాపట్ల,  ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో  కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సోమవారం : – ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు ; తూర్పుగోదావరి, కోనసీమ, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మంగళవారం: –  విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు ,  కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *