ఆగష్టు 1న ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం-సీఎం చంద్రబాబు
ఉత్తరాంధ్రకు మణిహారం..
అమరావతి: భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగష్టు 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారు అయ్యింది.2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్ పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి…రెండేళ్ల కాలంలో పూర్తి చేసింది. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టు ప్రారంభ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. సమీక్షకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సిఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు సత్యకుమార్, అచ్చెన్నాయుడు, అనితతో పాటు పలువురు పాల్గొన్నారు. సమీక్షకు హాజరైన ఏవియేషన్ శాఖ అధికారులు, ఎయిర్ పోర్టు నిర్మించిన జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు భోగాపురం ఎయిర్పోర్టులో నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను వివరించారు. ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు వివరించిన అధికారులు వివరించారు.

