NATIONAL

అంతరిక్ష పరిశోధనా సంస్థలో సైంటిస్టుల రాజీనామాలు

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో కీలక మిషన్లకు సంబంధించిన సైంటిస్టుల రాజీనామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దింతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గగన్‌యాన్ వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సైంటిస్టుల స్వచ్ఛంద పదవీ విరమణ, రాజీనామాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ అంతరిక్ష శాఖ (Department of Space-DoS) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 14వ తేదిన అంతర్గత మెమో విడుదల చేసినట్లు సమాచారం. గగన్‌యాన్ సహా కీలక జాతీయ మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది సమర్పించే రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను ఇకపై సాధారణంగా ఆమోదించరాదని ఆదేశించింది.

ఇటీవల 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు ఇస్రోను వీడినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని U.R.Rao శాటిలైట్ సెంటర్ (URSC) నుంచి సుమారు 80 మంది, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి 20 మంది సైంటిస్టులు రాజీనామా చేసినట్లు సమాచారం. మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కీలక మిషన్లకు నాయకత్వం వహించిన సైంటిస్టులే అధికంగా ఉండటం గమనార్హం. రాజీనామా చేసిన వారిలో ఎల్‌వీఎం-3 (LVM-3) ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పాడెక్స్ (SpaDeX) ప్రాజెక్ట్ డైరెక్టర్, చంద్రయాన్-3 సిమ్యులేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్య రాళ్లపల్లి వంటి ప్రముఖ సైంటిస్టులు ఉన్నారు. చంద్రయాన్-3 మిషన్‌లో చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియను ధృవీకరించేందుకు లక్షకు పైగా పరీక్షలు నిర్వహించి దాదాపు 25 టెరాబైట్ల డేటాను రూపొందించిన బృందానికి ఆదిత్య రాళ్లపల్లి నాయకత్వం వహించారు.

సైంటిస్టులు రాజీనామే చేసినా ప్రాజెక్టులు ఆగవు: ఇస్రో చైర్మన్

ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్,, శాస్త్రవేత్తల రాజీనామాలను అంగీకరిస్తూనే, సంస్థకు వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తెలిపారు. ఏ సంస్థలోనైనా ఉద్యోగుల నిష్క్రమణ సహజమని పేర్కొన్నారు. కీలక ప్రాజెక్టులు దీనివల్ల ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా ఉద్యోగం వీడితే వారి బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తామని వెల్లడించారు. కొత్త ఆదేశాలతో 2020లో అమల్లోకి వచ్చిన పరిపాలనా ఉత్తర్వులను అంతరిక్ష శాఖ రద్దు చేసింది. అప్పటివరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు, యూనిట్ హెడ్‌లు సైంటిస్ట్/ఇంజనీర్-ఎస్‌జీ స్థాయి వరకు ఉన్న గ్రూప్-ఏ శాస్త్రవేత్తల రాజీనామాలు, వీఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించే అధికారాన్ని కలిగి ఉండేవారు. ఇకపై అలాంటి అభ్యర్థనలను నేరుగా ఆమోదించకుండా, సంబంధిత ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పెండింగ్‌లో ఉంచి, డైరెక్టర్ సిఫారసులతో కలిసి అంతరిక్ష శాఖకు పంపాల్సి ఉంటుంది. తుది నిర్ణయం శాఖే తీసుకోనుంది.

ఇస్రోకు ఇదేం కొత్త సమస్య కాదు:- ఉద్యోగుల నిష్క్రమణ సమస్య ఇస్రోకు కొత్తది కాదు.2004-2007 మధ్య కాలంలో కొత్తగా చేరిన ఉద్యోగుల్లో దాదాపు సగం మంది రాజీనామా చేసినట్లు గత నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే 2012 నుంచి 2024 మధ్య సుమారు 700 మంది ఉద్యోగులు ఇస్రోను వీడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *