భారతదేశం,ప్రపంచ ఆర్దిక వ్యవస్థల వృద్ధికి వేదిక-ప్రధాని మోదీ
అమరావతి: భారతదేశం, ప్రపంచ ఉత్పత్తులకు మార్కెటింగ్ కేంద్రం మాత్రమే కాదని, ప్రపంచ ఆర్దిక వ్యవస్థల వృద్ధికి వేదిక అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.భారత్-న్యూజిలాండ్ వ్యాపార, క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ప్రధాని ప్రసంగించారు. భారత్, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్-న్యూజిలాండ్ ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సాంకేతికత, సేవలు, రెండు దేశాల మధ్య రాకపోకలు, పెట్టుబడులు సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందన్నారు.
భారత్‌లో 20 బిలియన్ డాలర్లు:- ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. రాబోయే 15 సంవత్సరాల్లో భారత్‌లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఇవీ కేవలం పెట్టుబడులు మాత్రమే కాదని, భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలనే నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. పట్టణ రవాణా, నీరు, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాల్లో భాగం కావాలని న్యూజిలాండ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ఆ దేశ యూనివర్సిటీలను కోరారు.

