ఇక నుంచి బీచ్ ల్లోనే బీర్లు అందుబాటులోకి?
తక్కువ ఆల్కహాల్ కలిగిన పానీయాలు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బీచ్ షాక్స్’ (Beach Shacks)పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవో నంబర్-362 ప్రకారం, ఎంపిక చేసిన బీచ్‌లలో పరిమిత నిబంధనలతో ఈ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) గుర్తించిన ప్రదేశాల్లో అమలు చేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2029 ఆగస్టు 31వ తేదీ వరకు ఈ విధానం కింద బీచ్ షాక్స్ ఏర్పాటునకు నోటిఫికేషన్ జారీ చేసింది.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం:- సూర్యలంక, విశాఖపట్నం బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మార్గదర్శకాల ప్రకారం బీచ్ షాక్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పనిచేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు. పర్యాటకుల భద్రత, నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. అలాగే ఇక్కడ తక్కువ ఆల్కహాల్ కలిగిన పానీయాలు మాత్రమే సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. భారత తయారీ విదేశీ మద్యం (IMFL), ఫారిన్ లిక్కర్‌కు ఈ షాక్స్ లో అనుమతి ఉండదని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

