నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీలు- విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రేపు, ఎల్లుండి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం నెల్లూరు(జి) కొమ్మిపాడులో 44.1°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 43.4°C, పల్నాడు(జి) బెల్లంకొండలో 43.3°C, మార్కాపురం(జి) నందనమారెళ్ళలో 43.2°C, చిత్తూరు(జి) గంగవరం 42.8°C, కర్నూలు(జి) నగరడోనలో 42.7°C, తిరుపతి(జి) దొరవారిసత్రంలో 42.5°C, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు 42.4°C, మన్యం(జి) మక్కువ, పోలవరం(జి) విఆర్ పురంలో 42.2°C, నంద్యాల(జి) చాగలమర్రి, ప్రకాశం(జి) కొప్పెరపాడు, వైఎస్సార్ కడప(జి) లింగాలలో 42.1°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 42 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
ద్రోణి ప్రభావంతో రేపు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

