రాజస్థాన్ లోని పచ్‌పద్ర రిఫైనరీలో ప్రారంభానికి ముందే భారీ అగ్నిప్రమాదం
అమరావతి: రాజస్థాన్, బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో 100 అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు రిఫైనరీ దగ్గరకు చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ (కాంగ్రెస్) ముఖ్యంత్రిగా వున్న సమయంలో పచ్‌పద్ర రిఫైనరీకి 2013 సెప్టెంబర్ 22వ తేదీన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. 37,230 కోట్ల రూపాయల వ్యయంతో రిఫైనరీ పనులు మొదలయ్యాయి.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ 2018 జనవరి 16వ తేదీన ప్రాజెక్ట్ పనులను మరోసారి ప్రారంభించారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాయి. భారతదేశంలో మొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇదే కావటం విశేషం. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో రిఫైనరీలో అగ్నిప్రమాదం జరిగింది.

