ఘోర రోడ్డు ప్రమాదంలో దగ్దం అయిన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-13 మంది సజీవ దహనం
అమరావతి: మార్కాపురం జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు,, టిప్పర్‌ను ఢీకొంది. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, 13 మంది సజీవ దహనమయ్యారు. ప్రయాణికులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 గురు ఉన్నట్లు సమాచారం. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్‌తో చెప్పారు. యర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు తెలంగాణలోని జగిత్యాల ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. జీవనోపాధి కోసం జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలో వచ్చి గృహ నిర్మాణ పనుల్లో పాల్గొంటారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణలోని జగిత్యాల నుంచి పామూరుకు బస్సు బయల్దేరింది. ఈ క్రమంలో చీమకుర్తి నుంచి కంకర్ లోడ్‌తో మార్కాపురం వైపు టిప్పర్ వస్తుండగా ఉదయం 6 గంటల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
బస్సులో మొత్తం 35 మంది:- ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉండగా, మంటలు చెలరేగగానే 10 మంది కిందకు దిగిపోయారు.15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.13 మంది సజీవ దహనం కాగా, చనిపోయిన వారు కనిగిరి, పామూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మృతుల వివరాలు:- మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవదహమవ్వగా మృతుల్లో పెదారికట్లకు చెందిన అంబటి అనిల్,, అంబటి లియో,, కనిగిరి మండలం చల్లగిరిగలకు చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ,, తమ్మిశెట్టి రుక్మిణి, కనిగిరి మండలం తింగారెడ్డిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి, బత్తుల పద్మ,, కనిగిరి మండలం తోకంచికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు,, పొదిలి మండలం ఉన్నగురువాయపాలెం వాసులు,, నర్సింగ్ ప్రభావతి,, నర్సింగ్ క్షేత్ర,, కనిగిరి మండలం పనుగోడుకు చెందిన దేవాండ్ల రామయ్య,, అదే విధంగా బుచ్చి మండలం మంగళకట్టకు చెందిన జయరామయ్యలుగా గుర్తించారు.
ప్రధాని నరేంద్ర మోదీ:- ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు:- ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మంత్రులు అనిత, జనార్థన్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ, కలెక్టర్ వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని సీఎంకు తెలిపారు.
22 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు జగిత్యాల నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై డ్రైవర్‌ను విచారించగా.. తన వాహనం స్టీరింగ్ స్టక్ అయ్యిందని చెప్పాడని, దీనిపై నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నారని సీఎంకు తెలియజేశారు. బస్సు పూర్తిగా ఆపోజిట్ రూట్లో వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

