ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్-కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. శనివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంద్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ ప్రాజెక్ట్ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది. భారతదేశంలోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌కు అమరావతి వేదిక కానుంది.
ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్‌ల:- క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తులు, నైపుణ్యాభివృద్ధికి క్వాంటమ్ వ్యాలీలో విస్తృత అవకాశాలు రానున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిలవనున్నది. ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ, లక్షలాది మంది యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందుబాటులోకి వస్తాయి. ఆగష్టు నాటికి భవన నిర్మాణం పూర్తిచేసి, డిసెంబర్‌లోపు క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
బోస్టన్, సింగపూర్, షాంఘైలతో సమానంగా:- క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కావడంతో పాటు వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి అంచనాలు కచ్చితంగా ఉండటం, బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం వంటి అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలోని బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి క్వాంటమ్ కేంద్రాలతో సమానంగా నిలవనుంది. భవిష్యత్తులో అమరావతి,, క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌లో కార్యకలపాలను విసృత్తం కానున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా ఏపీ మంత్రులు నారా లోకేశ్, నారాయణ, కందుల దుర్గేశ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

