AP&TGOTHERSTECHNOLOGY

ప్రపంచంలోనే తొలి క్వాంటం, ఏఐ ప్రత్యేక విశ్వవిద్యాలయ క్యాంపస్ ప్రారంభం

అమరావతికి మరో మణిహారం…‘నీలిట్’ డీమ్డ్ టు బి యూనివర్సిటీ..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక క్యాంపస్..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు..

జనవరి నుంచి ప్రత్యేక కోర్సులు..

తిరుపతిలోనూ కార్యకలాపాల విస్తరణ..

అమరావతి: క్వాంటం వ్యాలీగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అమరావతి తాత్కాలిక క్యాంపస్‌ను శనివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ ఎ. ప్రతిభ ఈ క్యాంపస్‌ను ప్రారంభించగా, నీలిట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి పాల్గొన్నారు.

క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొలి విశ్వవిద్యాలయ క్యాంపస్‌గా ఇది నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటవుతున్న ఈ సంస్థ అమరావతి క్వాంటం వ్యాలీలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా మారనుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సీడీఈ భవనం నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు:-  —కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన నీలిట్‌కు ‘ఇన్‌స్టిట్యూషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ (డిస్టింక్ట్ కేటగిరీ)’ హోదా ఉంది. పంజాబ్‌లోని రూపార్‌లో ప్రధాన క్యాంపస్ ఉండగా, దేశవ్యాప్తంగా 11 అనుబంధ క్యాంపస్‌లు ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీలిట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం జరిగిన తొమ్మిది నెలల్లోనే అమరావతి క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభం కావడం విశేషం.

తాత్కాలిక క్యాంపస్‌లో రూ.47 కోట్లతో నాలుగు అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, చిప్ డిజైన్, వీఎల్ఎస్ఐ, ఏఐ, కంప్యూటింగ్ రంగాలకు సంబంధించిన ప్రయోగశాలలు ఇందులో అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ లభించనుంది.

జనవరి నుంచి ప్రత్యేక కోర్సులు:- క్వాంటం, ఏఐ, అనుబంధ సాంకేతిక రంగాల్లో నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా వచ్చే జనవరి నుంచి వివిధ కోర్సులను ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్, తరగతి గది విధానాల్లో శిక్షణ అందించనున్నారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధితో పది అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఏఐ వినియోగం, చిప్ డిజైన్, వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు ‘ఓ’ లెవెల్ ప్రోగ్రామ్‌లు, మరో 16 స్వల్పకాలిక కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

వీఎల్ఎస్ఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చైన్, సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్, క్వాంటం టెక్నాలజీ వంటి విభాగాల్లో శిక్షణ కల్పించనున్నారు. రాష్ట్రంలోని కళాశాల అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధికి పది విభాగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.

అమరావతిలో రూ.730.70 కోట్లతో శాశ్వత క్యాంపస్:- దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అమరావతిలో రూ.730.70 కోట్లతో నీలిట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపారు. ఇందుకోసం అమరావతిలోని నిడమర్రు వద్ద 8.5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రాబోయే ఐదేళ్లలో ఈ క్యాంపస్ ద్వారా సుమారు 8,250 మందికి శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1,650 మందికి డిగ్రీ కోర్సుల ద్వారా, మరో 6,600 మందికి నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా శిక్షణ కల్పించనున్నారు. క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్, డిప్లొమా కోర్సులను అందించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేస్తున్న ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌పై పనిచేసే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించనున్నారు. భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుండగా, భవనాల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులను నీలిట్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ భరించనున్నాయి. శాశ్వత క్యాంపస్ సిద్ధమైన తర్వాత ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న ప్రయోగశాలలు, అధ్యాపకులు, విద్యార్థులను కొత్త క్యాంపస్‌కు తరలించనున్నారు.

తిరుపతిలోనూ కార్యకలాపాల విస్తరణ:- అమరావతితో పాటు రాయలసీమలోనూ నీలిట్ కార్యకలాపాలను విస్తరించనున్నారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక వసతి నుంచి పనిచేస్తున్న నీలిట్ తిరుపతిని సొంత శాశ్వత క్యాంపస్‌కు తరలించే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం మూడు ఎకరాల భూమి కేటాయించాలని ప్రతిపాదించగా, ఎస్వీ విశ్వవిద్యాలయం ఇప్పటికే నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేసింది. తిరుపతి క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీకండక్టర్ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నీలిట్ క్యాంపస్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అధ్యాపకులతో పాటు పరిశ్రమలకు కూడా ప్రయోజనం కలగనుంది. జాతీయ క్వాంటం మిషన్, ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. తద్వారా అత్యాధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన నిపుణులను తయారు చేస్తూ, అమరావతిని అంతర్జాతీయ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలకు ఈ విశ్వవిద్యాలయం దోహదపడనుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *