రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడిన వారికి రూ.25 వేల నగదు ప్రోత్సాహకం-జిల్లా కలెక్టర్
క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చే వారికి ‘రాహ్-వీర్’ పథకం..
పోలీసు విచారణలు, వేధింపులకు గురిచేయకుండా..
నెల్లూరు, నవంబర్ 21 : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించిన ‘రాహ్-వీర్ (RAH-VEER) – గుడ్ సమారిటన్ రివార్డ్ స్కీమ్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమల్లో ఉందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారని, ఈ సమయంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రి లేదా ట్రామా కేర్ సెంటర్‌కు చేర్చి వారి ప్రాణాలను కాపాడిన వారికి రూ.25,000 నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారని వివరించారు. గతంలో ఈ ప్రోత్సాహక మొత్తం రూ.5,000 ఉండగా, దానిని రూ.25,000కు పెంచారని తెలిపారు. ఒక రోడ్డు ప్రమాద ఘటనలో గరిష్ఠంగా ఐదుగురు సహాయకులకు ఈ ప్రోత్సాహకాన్ని అందించే అవకాశం ఉందన్నారు.
మానవతా దృక్పథంతో స్పందించాలి:- రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి చేర్చి అతని ప్రాణాలను కాపాడిన ఎవరైనా ఈ పథకానికి అర్హులని కలెక్టర్ తెలిపారు. ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారిని అనవసరమైన పోలీసు విచారణలు, వేధింపులకు గురిచేయకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గుడ్ సమారిటన్ మార్గదర్శకాల ప్రకారం రక్షణ కల్పిస్తారని తెలిపారు. సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారు పోలీసు లేదా న్యాయపరమైన ఇబ్బందులకు గురవుతామనే భయాన్ని వీడాలని సూచించారు.
ప్రోత్సాహకం పొందే విధానం:- ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు, బాధితుడిని తీసుకొచ్చిన సహాయకుడి వివరాలను ఆసుపత్రి నమోదు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీసులు ప్రమాద వివరాలను పరిశీలించి, అర్హతను నిర్ధారించి జిల్లా రహదారి భద్రత విభాగం, రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపిస్తారని వివరించారు. జిల్లా రవాణా అధికారి ద్వారా కలెక్టర్‌కు సిఫార్సు చేయగా, ఆమోదం అనంతరం నిబంధనల ప్రకారం నగదు ప్రోత్సాహకాన్ని లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యం కీలకం:- రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు రోడ్డు ప్రమాదాలను చూసి భయపడి దూరంగా ఉండకుండా మానవతా దృక్పథంతో స్పందించి క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 108 లేదా 112కు సమాచారం అందించి సహాయం పొందాలని సూచించారు.

