కైశిక ద్వాదశి.. శ్రీవారి ఊరేగింపు-ఏడాదికి ఒక్కరోజే దర్శనమిచ్చే ఉగ్రశ్రీనివాసమూర్తి
సూర్యోదయానికి ముందే నాలుగు మాడ వీధుల్లో..
శ్రీ వరాహస్వామి భూదేవికి 82 శ్లోకాలతో వివరించిన కైశిక పురాణం..
ఉగ్రశ్రీనివాసమూర్తి దర్శనమివ్వడం..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించారు. ఈ పర్వదినంలో అత్యంత విశేషమైన ఘట్టం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు. ఏడాదిలో ఒక్క కైశిక ద్వాదశి రోజున మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయం వెలుపలకు వచ్చి భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవం ప్రత్యేకత.
వేకువజామున 4.30 నుంచి 5.45 గంటల వరకు సూర్యోదయానికి ముందే స్వామివారిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉగ్రశ్రీనివాసమూర్తిని వేంకటతురైవార్, స్నపనబేరం అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇతర పర్వదినాల్లో మలయప్పస్వామివారు ఊరేగింపులో పాల్గొంటుండగా, కైశిక ద్వాదశి రోజున మాత్రం ఉగ్రశ్రీనివాసమూర్తి దర్శనమివ్వడం విశేషం.
సూర్యోదయానికి ముందే ఎందుకు? 14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు సందర్భంగా స్వామివారి విగ్రహంపై సూర్యకిరణాలు పడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు చారిత్రక సంప్రదాయం చెబుతోంది.అప్పటి నుంచి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహించే ఆచారం కొనసాగుతోంది.
నంబదువాన్ భక్తి ప్రాశస్త్యం:- కైశిక ద్వాదశి వెనుక కైశిక పురాణంలోని నంబదువాన్ కథ ఉంది. శ్రీ వరాహస్వామి భూదేవికి 82 శ్లోకాలతో వివరించిన కైశిక పురాణం ఈ పర్వదినానికి ఆధ్యాత్మిక నేపథ్యం. నంబదువాన్ అనే పరమభక్తుడు కైశిక రాగంలో స్వామివారిని కీర్తించి తిరిగి వస్తానని బ్రహ్మరాక్షసుడికి మాట ఇచ్చి, ఆ మాటను నిలబెట్టుకున్నాడు. అతని భక్తికి, సత్యనిష్ఠకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడని పురాణగాథ చెబుతోంది.

