AP&TG

సుదీర్ఘకాలంగా అనధికార విధుల గైర్హాజరీ వైద్యులపై ప్రభుత్వ కొరడా

70 మంది వైద్యులకు ఉద్వాసన..

వివిధ దశల్లో మరో 193 మందిపై చర్యలు..

గత మే నెలలోనే డిఎంఈ పరిధిలో 51 మంది వైద్యుల తొలగింపు..

ఉపేక్షించొద్దని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు..

అమరావతి: సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 70 మంది వైద్యులను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) తొలగించింది. ఏడాదికిపైగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీసు నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి, ఇతర నిబంధనలను అనుసరించి చివరి చర్యగా విధుల నుంచి తప్పించాలని శాఖాపరంగా నిర్ణయించినట్లు అధికారులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. రూల్ నంబర్ 20 ఆఫ్ ఏపీసీఎస్ (సీసీఏ) రూల్స్-1991 అనుసరించి వీరిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్న వీరిలో గైనిక్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాల్టీ వైద్యులు ఉన్నారని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు.

మరో 154 మందిపై చర్యలు వివిధ దశల్లో:- డీఎస్‌హెచ్ పరిధిలోనే మరో 154 మంది వైద్యులు అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్నారు. వీరి విషయంలోనూ నిబంధనలను అనుసరించి సంజాయిషీ నోటీసులను జారీ చేశారు. తదుపరి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. నోటీసుల అనంతరం విధుల్లో చేరేందుకు ముందుకొస్తే ఇంక్రిమెంట్లలో కోత వంటి క్రమశిక్షణా చర్యలను అనుసరించి అవకాశాలను కల్పిస్తున్నారు. ఇలా డీఎస్‌హెచ్ పరిధిలో అంతకుముందు 78 మంది వైద్యులు విధుల్లో చేరారు.

గైర్హాజరీలో ఉన్న 39 మంది వైద్యులకు తుది అవకాశం:-  డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తూ విధులకు హాజరుకాని 39 మంది వైద్యులకు ప్రభుత్వం తుది అవకాశం కల్పించింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏడాదికి పైగా, రెండేళ్లలోపు కాలంగా విధులకు గైర్హాజరవుతున్న వీరికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదు. విధుల్లోనూ చేరలేదు. సర్వీస్ నిబంధనలను అనుసరించి వీరికి తుదిగా అవకాశం కల్పిస్తామని, స్పందన లేకుంటే విధుల నుంచి తప్పిస్తామని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. గైర్హాజరైన 39 మంది వైద్యుల్లో ఐదుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. సంబంధిత అధికారులు మంజూరు చేసిన సెలవులు లేకుండానే వీరు విధులకు దూరంగా ఉన్నారు. గత మే నెలలో డీఎంఈ పరిధిలో 51 మంది వైద్యుల్ని విధుల నుంచి శాశ్వతంగా తప్పించారు.

గైర్హాజరీలు మొత్తం 493 మంది:- గైర్హాజరీల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, నిబంధనల ప్రకారం విధుల నుంచి తప్పించాలని మంత్రి సత్యకుమార్ సదరు హెచ్‌ఓడీ అధికారులకు ఇటీవల స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిర్దిష్టమైన ప్రమాణాలను అనుసరించి గైర్హాజరీలో ఉన్నవారిని విధుల నుంచి తప్పించే ప్రక్రియను గరిష్టంగా 3 నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అనవసరంగా నాన్చుడి ధోరణి అవలంబించొద్దని కూడా  స్పష్టంగా చెప్పారు.

హెచ్ ఓ డి కార్యాలయాల వారీగా:- వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాల పరిధిలో కలిపి ఇటీవల తేల్చిన  లెక్కల ప్రకారం 493 మంది వైద్యులు, ఇతర సిబ్బంది విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. డీఎస్‌హెచ్, డీఎంఈ పరిధిలోని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎన్‌హెచ్‌ఎం (ఒప్పంద), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆయుష్, ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కొందరు గైర్హాజరీలో ఉన్నారు. ఈ 493 మంది గైరాజరీలపై సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలు అనుసరించి తొలగింపుల వంటి ప్రక్రియను చేపట్టినట్లు మంత్రికి అధికారులు వివరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *