AP&TGDISTRICTS

ఎక్కడికి వెళ్లినా నేషన్ ఫస్ట్ అనే భావన అందరిలో ఉండాలి-యోగి ఆదిత్యనాథ్

స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు..

నెల్లూరు: స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా రెండున్న దశాబ్దలుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్  ప్రశంసలు కురిపించారు. సమాజం కోసం ఈ ట్రస్ట్ తీసుకున్న సంకల్పం ఎంతో గొప్పదని అభినందించారు. సోమవారం నెల్లూరులోని వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో, సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రసంగంలో భాగంగా “అందరికీ వందనం” అంటూ యోగి తెలుగులో మాట్లాడి సభికుల్లో ఉత్సాహం నింపారు.

‘కరోనా మహమ్మారి వల్ల అనేకమంది తల్లిదండ్రులు చనిపోయారు.అనాథ పిల్లలకు యూపీలో అటల్ ఆవాస్ విద్యాలయ్‌లో ఉచిత విద్య. మా గురుకుల పాఠశాలల్లో వసతుల కల్పనకు వెంకయ్యనాయుడే స్పూర్తి. సాంకేతికత పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకునే దేశమే ముందుకెళ్తోంది. ఎంత చదువుకుని, ఉన్నతస్థానానికి వెళ్లినా దేశం పట్ల భక్తి ఉండాలి, ఎక్కడికి వెళ్లినా నేషన్ ఫస్ట్ అనే భావన అందరిలో ఉండాలని’ యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ కల్పిస్తున్నామని వివరించారు. కులవృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నామని, మహిళలకు స్వయం ప్రవృత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గో సంరక్షణ చేపట్టే వారికి నెలకు రూ.1500లను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ లో 25 కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఉన్నారని చెప్పారు. గతంలో మరుగుదొడ్లు లేక, అనారోగ్యాలతో వేలమంది‌ చనిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని‌ మోదీ తీసుకువచ్చిన స్వచ్ఛభారత్‌తో వ్యక్తిగత మరుగుదొడ్లు వచ్చాయని తెలిపారు. గ్రామాల్లో అనారోగ్య మరణాలు ఆగిపోయాయని యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు.

అంతకుముందు అక్షర విద్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద యోగి ఆదిత్యనాథ్‌కు ట్రస్ట్ నిర్వహకులు, నేతలు స్వాగతం పలికారు. అనంతరం సోమా సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఆదిత్యనాథ్‌ సందర్శించి అక్కడ శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో యువతకు ఇస్తున్న సాంకేతిక శిక్షణ, నైపుణ్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల స్కేటింగ్ ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. అక్షర విద్యాలయ నిర్వహణను యోగి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌, మంత్రులు నారాయణ, సత్యకుమార్​తోపాటు తదితరులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *