అర్హులైన యోగ శిక్షకులు రిజిస్టర్ చేసుకోండి-కమిషనర్ సూర్య తేజ
పార్కుకు ఒక యోగా శిక్షకుడిని నియమకం..
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ఉద్యానవనాల్లో ప్రజలకు ప్రతిరోజు యోగా ద్వారా శారీరక వ్యాయామాన్ని అందించేందుకు అర్హులైన శిక్షకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కమిషనర్ సూర్య తేజ ప్రకటించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శారీరక శ్రమను వ్యాయామం ద్వారా కలిగించే విధంగా యోగా ప్రక్రియను నగరవ్యాప్తంగా ఉన్న అన్ని పార్కులలో అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఆసక్తిగల యోగా శిక్షకులు రానున్న శనివారం లోపు నగరపాలక సంస్థ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకొని తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులను ప్రభుత్వ యోగా శిక్షకుల ఆధ్వర్యంలో ఎంపిక చేసుకొని ప్రతి ఒక్క పార్కుకు ఒక యోగా శిక్షకుడిని నియమించి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు పార్కుకు విచ్చేసే సందర్శకులు, ప్రజలకు శిక్షణ అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. దరఖాస్తుదారులు తమ వివరాలను నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ వాట్సాప్ నెంబర్ 9494018118 కు పంపించాలని సూచించారు. అదేవిధంగా పన్ను బకాయిదారులంతా బాధ్యతగా బకాయిలను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కమిషనర్ కోరారు. నగరవ్యాప్తంగా పార్కులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలనే వెచ్చిస్తున్నామని, ప్రజలంతా తమ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కమిషనర్ ఆకాంక్షించారు.