ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలి-వనమహోత్సవ వేడుకల్లో మంత్రి నారాయణ
నెల్లూరు: ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో నగరవనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వనమహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి నగరవనంలో భూమిపూజ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014 నుంచి 2019 సమయంలో నగరవనం 330 ఎకరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రారంభించామన్నారు. మనిషి బతకాలంటే నీరు, చెట్లు ఎంతో అవసరమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు చెట్ల పాత్ర చాలా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిలుపు మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో 21.7 శాతం, ఆంధ్రలో 23 శాతం, నెల్లూరులో 25 శాతం గ్రీనరీ ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో గ్రీనరీని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,జబ్పీ చైర్ పర్సన్ అరుణమ్మ, ఎమ్మేల్యే సోమిరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, డిఎఫ్ వో చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.