కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు!-కలెక్టర్
40వేల వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు-ఎమ్మేల్యే ప్రశాంతి
నెల్లూరు: కోవూరు చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో చక్కెరకర్మాగారం రైతులు, కార్మికులు, షేర్ హోల్డర్లతో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆనంద్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు, షుగర్ ఫ్యాక్టరీ భూములను ఏపిఐఐసికి అప్పగించి పరిశ్రమల ఏర్పాటు చేయడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన మొదలైన అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కోవూరు చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిందని, రైతులు, కార్మికులు ఆలోచించి ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. కార్మికులకు బకాయిలను చెల్లించేందుకు సీఎం ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి సుమారు 124 ఎకరాల భూములను ఎపిఐఐసికి అప్పగించి పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్షంగా 10వేల ఉద్యోగాలు పరోక్షంగా, మరో 30వేల ఉద్యోగాలు మొత్తం సుమారు 40వేల వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ విషయమై రైతులు, కార్మికులు చర్చించుకుని తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. కార్మికులు తమకు చెల్లించాల్సిన 24కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని విన్నవించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ షుగర్ కేన్ జాన్ విక్టర్, రైతు సంఘాల నాయకులు శ్రీనివాసులు, శ్రీరాములు, సిఐటియు నాయకులు టివివి ప్రసాద్, షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షులు నారాయణ, షేర్ హోల్డర్లు, పలువురు రైతులు, కార్మికులు పాల్గొన్నారు.