AGRICULTUREDISTRICTSOTHERS

మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం,కేసులు నమోదుచేస్తాం-మంత్రి నాదెండ్ల

క్యూఆర్‌ కోడ్‌ కలిగిన కొత్త రేషన్‌కార్డుల..

నెల్లూరు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శనివారం ఉదయం సంగం మండలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలో 20.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, గోదాములు, ధాన్యం కొనుగోలు  కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. ప్రతి విషయంలోనూ రైతులకు మంచి చేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రైతులకి మార్కెట్‌ని బట్టి మద్దతు ధర అందించేలా కృషి చేస్తామన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మిల్లర్లకు రూ.10 కోట్లు చెల్లించామన్నారు. అలాగే జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రవాణా, హమాలి చార్జీలు రూ.1.40 కోట్లు రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మార్చి నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో సుమారు 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

రైతులతో ముఖాముఖి:- సంగంలో రైతులతో ముఖాముఖిగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా 30 లక్షల గోతాలను అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. తేమశాతం 17 కంటే ఎక్కువగా ఉంటే ఒక కేజీ నుంచి ఐదు కేజీల వరకు మాత్రమే ధాన్యం తీసుకోవాలని, అంతకు మించితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను హెచ్చరించారు.

క్యూఆర్‌ కోడ్‌ కలిగిన కొత్త రేషన్‌కార్డులు:- వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్‌ కోడ్‌ కలిగిన కొత్త రేషన్‌కార్డులను అందిస్తామని చెప్పారు.రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *