జిఎస్‌టి పన్ను చెల్లింపు విధానంతో మెరుగైన సత్ఫలితాలు- ఆనంద్ కుమార్
వ్యాపారులందరూ సకాలంలో పన్ను చెల్లించాలి..
నెల్లూరు: భారత ప్రభుత్వం ఒకే దేశం-ఒకే మార్కెట్ – ఒకే పన్ను విధానం పేరుతో అమలుచేస్తున్నగూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్ (జిఎస్‌టి)తో పన్ను చెల్లింపు విధానంతో మెరుగైన సత్ఫలితాలు అందిపుచ్చుకుంటున్నట్లు సెంట్రల్ జిఎస్‌టి ఏ.పి. కమిషనర్ (ఆడిటింగ్ వింగ్) శ్రీ పి.ఆనంద్ కుమార్, ఐ.ఆర్.ఎస్ పేర్కొన్నారు..శనివారం నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్, ది ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నెల్లూరు బ్రాంచి సంయుక్తంగా నిర్వహించిన సెమినార్‌లో కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఒకేవిధమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జిఎస్‌టి) విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జిఎస్టీ విధానం రాకముందు కేవలం 70లక్షలు మాత్రమే పన్ను చెల్లింపుదారులు దేశంలో వుంటే ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అనగా 1.40 కోట్లకు చేరడం జిఎస్టీ విధానం ద్వారా సాధించిన ఫలితంగా ఆయన చెప్పారు. అలాగే జిఎస్టీ విధానం ద్వారా పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతో సరాసరి 14.5శాతంగా వున్న పన్నుమొత్తం 11.5శాతంగా తగ్గి పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గిందన్నారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ విధానం కూడా చాలా సరళీకృతమైందన్నారు. వేగంగా జిఎస్టీ లైసెన్సులను మంజూరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో 1200 రకాల వస్తువులు, 500 రకాల సేవల ద్వారా జిఎస్టీ పన్ను వసూలు అవుతుందని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో జిఎస్టీ విధానం ద్వారా మరింత ఎక్కువమంది వ్యాపారులు, సంస్థలను సులభతర విధానంలో పన్నులు చెల్లించేలా, పన్నుచెల్లింపుదారుల సంఖ్యను పెంచి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా తమశాఖ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, బ్రిడ్జిలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఇతర మౌలిక సదుపాయాలు, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే సంక్షేమ పథకాల అమలులో జిఎస్టీ ద్వారా ప్రజలు చెల్లించిన మొత్తం ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన వివరించారు.