ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్లు మంజూరైన-కలెక్టర్
నెల్లూరు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులందరూ మార్చి 2025 లోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్ ఆనంద్ పిలపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఎఎస్ పేట మండలం తెల్లపాడు గ్రామంలోని హౌసింగ్ లేఅవుట్‌ను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గృహనిర్మాణ లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 2025 నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 హౌసింగ్ స్కీం పూర్తవుతుందని, ఈలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని సూచించారు. హౌసింగ్ బిల్లులు కూడా సకాలంలో మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. హౌసింగ్ లేఅవుట్‌లో విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని, లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా పొదుపు రుణాలు మంజూరు చేయించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకుంటే సిమెంట్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా వెంటనే కల్పిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ కూడా తమ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పిడి దయాకర్, తాసిల్దార్ శ్రీరామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.