వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన విజయవాడ ప్రజలను ఆదుకోవడంలో నెల్లూరు ప్రజలు భాగస్వామ్యులు కావాలని, మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ సౌహార్డ్రతను చూపాలని కమిషనర్ సూర్యతేజ ఆకాంక్షించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 55 వేల అల్పాహార ప్యాకెట్లను నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి 9 ప్రత్యేక వాహనాల్లో మంగళవారం తెల్లవారజామున తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి , పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణల ఆదేశాల మేరకు వరద సహాయక చర్యల్లో భాగంగా భోజన ప్యాకెట్లను సిద్ధం చేసి తరలిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలను చేపట్టేందుకు గత రాత్రి అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన యాక్షన్ ప్లాన్ అమలు చేశామని తెలిపారు. హోటల్స్ అసోషియేషన్లు, కేటరింగ్ బృందాలు సహకారంతో లక్ష మందికి మధ్యాహ్నం భోజనం, మరో లక్ష మందికి రాత్రి భోజనాలను సిద్ధం చేసి తరలించనున్నామని కమిషనర్ వెల్లడించారు. వరద బాధితుల సహాయార్థం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నామని, సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు దుస్తులు, ఇతర సామగ్రి అందించి తోడ్పడాలని కమిషనర్ సూచించారు. విపత్తు నష్ట నివారణ చర్యలలో భాగంగా ప్రభుత్వ కార్యాచరణతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఆవశ్యకమని, స్వచ్ఛంద సంస్థలు, వస్త్రాల అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు,ఇతర విభాగాల దాతలు స్పందించి తమ ఉదారతను చాటుకోవాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ.సంజయ్,చంద్రయ్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ దేవీ కుమారీ, మేనేజర్ ఇనాయతుల్లా, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు , రాజేశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.