ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చర్యలు-కలెక్టర్
నెల్లూరు: ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యాన్ని విక్రయించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు..మంగళవారం కలెక్టరేట్లో రైతులు, ధాన్యం ట్రేడర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బయట రాష్ట్రాల వారు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో స్థానికంగా ఉన్నటువంటి ట్రేడర్లు కుమ్మక్కై ఇతర రాష్ట్రాల ట్రేడర్లను రానీయకుండా చేసి, ధర పతనానికి కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర పలికిన ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ధర గురించి ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటుందన్నారు. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపినందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, మార్కెటింగ్ శాఖ ఏడి అనిత , రైతు సంఘాల నాయకులు ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.