AGRICULTUREDISTRICTSOTHERS

మద్దతు ధర కంటే తక్కువకు కొంటే దళారులు, మిల్లర్లపై కేసులు- జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌

కంట్రోలు రూం నెంబరు 8520879979..

నెల్లూరు: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు మరింత విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ చెప్పారు. సోమవారం ధాన్యం సేకరణపై జేసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన 300 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు సుమారు 11 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హెల్పర్లను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. జిల్లా, మండల, గ్రామస్థాయిలో అధికారులు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. మద్ధతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఎవరైనా రైతులను ప్రలోభపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నామని చెప్పారు. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు ఉండకూడదని మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అమలు చేసేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 25 వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 40కోట్ల మేర మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు అందజేసి వున్నారని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహాలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 3.50 లక్షల గన్నీబ్యాగులు అందుబాటులో వున్నాయని, ధాన్యం సేకరణ ఎక్కువగా వున్న కేంద్రాల్లో గన్నీ బ్యాగులను ముందుగా సిద్ధం చేసి ఉంచుతున్నట్లు చెన్పారు. లారీ, ట్రాక్టర్‌ అసోసియేషన్లతో సంప్రదించి ప్రస్తుతం ప్రభుత్వం అనుమతించిన రేట్ల మేరకు వాహనాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 250 లారీలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాటుచేశామని, ఇవి ఎట్టిపరిస్థితిలో జిల్లా దాటివెళ్లకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. వాహనాలను పర్మినెంట్‌ జిపిఎస్‌ కాకుండా టెంపరరీ మాగ్నటిక్‌ జీపీఎస్‌ను ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీని ఎంపిక చేసినట్లు చెప్పారు. దీంతో జీపీఎస్‌ వాహనాల సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. మన జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ప్రకాశం జిల్లా నుంచి 10మంది రైసుమిల్లర్లను కొనుగోలు కేంద్రాలకు అనుసంధానించినట్లు చెప్పారు. ఈ మిల్లుల నుండి ఒక్కొక్క మిల్లుకు 500 మెట్రిక్ టన్నులు సేకరించేలా ప్రతిరోజూ 5000 మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. ఇంకా ఇతర జిల్లాల నుంచి ఆసక్తి గల మిల్లర్లను అనుసంధానిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులను కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 50శాతం కోతలు పూర్తయ్యాయని, మరో రెండువారాల్లో మరో 50శాతం కోతల పూర్తికానున్న నేపథ్యంలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా వుందని చెప్పారు. రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తూ కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని,  రైతులందరూ దళారుల ప్రలోభాలకు లొంగకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి అంకయ్య, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ అర్జున్‌రావు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *