బక్రీద్ సందర్భంగా జంతు సంక్షేమ చట్టాలను కఠినంగా అమలు చేయాలి-జిల్లా కలెక్టర్
అక్రమ వధ, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా..
నెల్లూరు: బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో జంతు సంక్షేమ చట్టాలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణ, పశువుల రక్షణకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, డిఆర్వో విజయకుమార్ ల తో కలిసి.. పశుసంవర్ధక, పోలీస్,మున్సిపల్, రవాణా శాఖ అధికారులతో నేరుగా అలగే ఆర్డీవోలు, మున్సిపల్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో చట్టపరమైన నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ.. జిల్లాలో బక్రీద్ పండుగ సందర్భంగా బయటి ప్రాంతాల నుండి జిల్లాలోకి, అలాగే జిల్లా నుండి బయయి ప్రాంతాలకు అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోకి వచ్చే టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక తనిఖీ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు వీడియోగ్రఫీ చేయాలన్నారు. అలాగే నెల్లూరు టౌన్ లో చిన్న బజార్ (8), నవాబ్ పేట (7), సంతపేట (4), దర్గామిట్ట (3), వేదాయపాలెం (5), బాలజీనగర్ (5)..మొత్తం 32 పోలీస్ పికెట్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
“వధ నిషేధం-ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధం-చట్టరీత్యా నేరం” అనే పోస్టర్ ను కలెక్టర్, ఎస్పీ విడుదల చేసారు.
ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి రమేష్ నాయక్, జడ్పి సీఈఓ శ్రీధర్ రెడ్డి, జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం నోడల్ అధికారి యశోద. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

