నగరంలోని 33 ప్రధాన ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు-కమీషనర్
నెల్లూరు: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగిన విధంగా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 33 ప్రధాన ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నామని కమిషనర్ నందన్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నగరానికి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లు అయిన పాత చెక్ పోస్టు రైల్వే గేటు ప్రాంతం, ముత్తుకూరు కూడలి హరనాధపురం, బి.వి నగర్ కరెంట్ ఆఫీస్ సెంటర్ రైల్వే గేటు, శెట్టిగుంట రోడ్డు ఆటో స్టాండ్ ప్రాంతాలలో చలువ పందిళ్లు వేయించి వాహన చోదకులకు నీడను కల్పించనున్నామని తెలిపారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసి ఉన్న 7 ఏసీ బస్సు షెల్టర్లలో ప్రయాణికులు బడలిక తీర్చుకునే విధంగా శీతల ఉష్ణోగ్రతను కల్పించేందుకు ఏసీ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించనున్నామని కమిషనర్ తెలియజేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య భవనాల కేంద్రాలు తమ వంతు సేవా కార్యక్రమాలలో భాగంగా తమ ప్రాంగణాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వేసవికాలంలో సహకరించాలని కమిషనర్ సూచించారు.

