రాజధాని పనులు వేగం మరింత పెరగాలి-ఐకానిక్ ముద్ర కనిపించాలి-ముఖ్యమంత్రి
నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగులు కాదు… రాజధాని
రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్
ప్రభుత్వ శాఖలు, అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా
అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామని.. ఈ మేరకు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్ వర్క్ అన్నట్టగా భావించవద్దని… చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్టుగా భావించాలన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన వివిధ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో రూ.57,821 కోట్ల విలవైన పనులు ఉండగా… వాటిల్లో రూ.50, 943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో మొత్తంగా 20 వేల మంది కార్మికులు, నిపుణులు పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది…లక్ష్యాన్ని ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం చర్చించారు.
ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దు:- రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దు… ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టే. నిర్మాణ సంస్థలుగా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు. కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలన్నారు.
నిర్మాణ సామాగ్రికి రక్షణ:- ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల ఘటన ప్రస్తావనకు వచ్చింది. నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థలకు లేదా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్టు సంస్థలు కానీ… అధికారులు కానీ తగిన రీతిలో స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయం చేస్తున్నారని… ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా కలెక్టర్లకు:-రాజధాని పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ కొరత కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగే పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

