మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు ‘హనుమాన్’-ఉపముఖ్యమంత్రి
అమరావతి: ‘వసుధైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే మన దేశంలో, సమస్త జీవకోటి, వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం అని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) ముందుకు తీసుకొచ్చామ’ని తెలిపారు.
సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ:- మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను వన్ కళ్యాణ్ ప్రారంభించారు.“హనుమాన్ ప్రాజెక్ట్ మానవ-వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లబోతున్నాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

