AP&TG

ఏపీని ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దుతాం-సీఎం చంద్రబాబు

విశాఖ స్టీల్‌ సిటీ నుంచి సిలికాన్‌ సిటీగా ఎదుగుతోంది-పీయూష్‌ గోయల్‌

మీ కలతోపాటు,ఏ.పి కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి: పవన్ కళ్యాణ్

పెట్టుబడిదారుల కోసం‘ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్’-మంత్రి లోకేష్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి పారిశ్రామిక, సాంకేతిక, తయారీ రంగాల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సోలార్ వేఫర్స్, సౌర ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, స్పేస్ విజన్, సెమీకండక్టర్ మిషన్, లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ మిషన్లను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించినట్లు వివరించారు.

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌:- భారత్‌లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పిలుపునిచ్చారు. తయారీ, పర్యాటకంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం శాశ్వత వేదికగా మారుతోందని పీయూష్‌ గోయల్‌ అన్నారు. పవిత్ర కార్తీక మాసంలో ఈ సదస్సు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లుగా.. పెట్టుబడుల సదస్సు దేశ వాణిజ్యాభివృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:- ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి గొప్ప వేదికగా అభివర్ణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీ కలతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కలను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు పూర్తి భద్రత, భరోసా కల్పించడంతోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్:- పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావడానికి కసరత్తు చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ చట్టం అమలుకు కేంద్ర స్థాయిలోనూ విధానపరమైన అనుమతులు, సహకారం కల్పించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *