AP&TGDEVOTIONALDISTRICTSOTHERS

రాష్ట్రవ్యాప్తంగా పురాతన ఆలయాలకు పూర్వవైభవం-మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి

రాష్ట్ర పండుగగా రథసప్తమి..

నెల్లూరు: సమస్త మానవళికి వెలుగులు ప్రసాదించే సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ మూలస్థానేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి మహాశివుడిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని సూర్యభగవానుడిని దర్శించుకుని ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అరసవెల్లిలోని ప్రముఖ సూర్య భగవానుడి ఆలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

నెల్లూరుజిల్లాలో 18 ప్రసిద్ధ ఆలయాల పున:నిర్మాణానికి రూ.38 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్త్రతమైన ఏర్పాట్లు చేపట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ మొదలైన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీకనుగుణంగా, భక్తులందరూ సంతృప్తికరంగా మహాదేవుడిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణతో కలిసి శివాలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం పురాతన రాతి కట్టడాలకు రంగు వేసి వాటి రూపుకోల్పోయేలా చేసిందని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని ఆలయాల్లోని రాతికట్టడాలను యధావిధిగా వుంచేలా, రంగులను తొలగించి పూర్వం ఎలా వున్నాయో అదేవిధంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరాలకు మన ఆలయాల విశిష్టత, చరిత్ర తెలిసేలా,  వేదాలు, ఆగమ శాస్త్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఆలయాల పూర్వవైభవానికి దృఢ సంకల్పంతో పనిచేస్తుందని మంత్రి చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *