భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య కుదిరిన యురేనియం సరఫరా ఒప్పందం
అమరావతి: భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇంధన భద్రతకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. భారతదేశ పౌర అణుశక్తి అవసరాలకు ఊతం ఇవ్వడం, అలాగే 2047 నాటికి 100 గిగావాట్ల అణు సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా, ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి దీర్ఘకాలిక వాణిజ్య యురేనియం ఎగుమతులకు వీలు కల్పించే ఒక కార్యాచరణ ఒప్పందాన్ని భారత్, ఆస్ట్రేలియా వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరిగిన వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
కలిసి పనిచేయాలని:- ఇంధన వాణిజ్యం, సరఫరా వ్యవస్థ బలోపేతం, స్వచ్ఛ ఇంధన వినియోగం పెంపుపై కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి.2015లో కుదిరిన అణు సహకార ఒప్పందం కింద యురేనియం ఎగుమతులకు అవసరమైన పరిపాలనా ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి.
శాంతియుత అవసరాలకే:- ఆస్ట్రేలియా నుంచి వచ్చే యురేనియం పూర్తిగా శాంతియుత అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశాయి. దీనిపై ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ’ భద్రతా నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా, ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశాయి. అయినా ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు కొనసాగిస్తామని వెల్లడించాయి.
భారత్ ప్రారంభించిన గ్లోబల్:- ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో ఆస్ట్రేలియా, ద్రవ ఇంధనాలు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో భారత్ కీలక భాగస్వాములని రెండు దేశాలు గుర్తించాయి. పునరుత్పాదక ఇంధనం, తక్కువ కాలుష్య ఇంధనాలు, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించాయి. బొగ్గు, డీజిల్, సహజ వాయువు వంటి ఇంధనాల సరఫరా స్థిరంగా కొనసాగేలా కలిసి పనిచేస్తామని స్పష్టంచేశాయి. భారత్ ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయన్స్ కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా స్వాగతించింది.

