కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మృతి
అమరావతి: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. టన్నెల్ వద్ద కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. మట్టిదిబ్బలు, రాళ్ల కింద పలువురు మరికొందరు చిక్కుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద మంగళవారం జరిగింది. మీనాక్షి బ్రిడ్జి సమీపంలో మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఆ మట్టిదిబ్బలు, రాళ్ల కింద పలువురు చిక్కుకుపోయారు. వీరిలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. సంఘటనపై సమాచారం అందుకున్న ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై కేరళ సీఎం వీడీ సతీషన్ స్పందిస్తూ, వయనాడ్ జిల్లా అధికారులతో మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించి బాధితుల్ని కాపాడాలని, వ్యవస్థల్ని సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించాల్సిందిగా మంత్రులు ఏపీ అనిల్ కుమార్, టీ సిద్దిఖ్‌లను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇక్కడ టన్నెల్ నిర్మాణ పనుల్ని సోమవారం నుంచే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగానే ఈ కొండచరియలు విరిగిపడి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ రాకముందే స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని,ఆరుగురిని రక్షించారు.

