AP&TGNATIONALPOLITICS

దేశ సమగ్రత… సమైక్యతే జనసేన పార్టీ ఆత్మ-జనసేనాని పవన్ కళ్యాణ్

జెన్ జీ తరానికి దేశభక్తితో..

అమరావతి: ‘దేశ సమగ్రత, సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుంది. దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్ అనేది పార్టీ విధానం… నినాదం. విభజన వాదాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల్లో విబేధాలు సృష్టించే శక్తులపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడుతారు. ఎన్నో చారిత్రక పోరాటాలకు నెలవైన ఢిల్లీ నేల నుంచి జనసేన పార్టీ దేశమంతటికీ వినిపించేలా చెప్పేదొక్కటే… దేశానికి ప్రమాదకరంగా, దేశ విచ్ఛిన్ననానికి కుట్రలు పన్నే ఏ శక్తితో అయినా మేం బలంగా పోరాడుతాం. దేశ సమైక్యత, సమగ్రతకు భంగం వాటిల్లే చర్యలను తప్పకుండా అడ్డుకుంటాం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ మెడలు వంచుతాం అని మాట్లాడే ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఢిల్లీ రాగానే అవేవీ గుర్తుండవు. మాట కూడా రాదు. జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా అధికారం కోసమో, పదవుల కోసమో, ప్రాపకం కోసమో, నిరసనల కోసమో రాలేదు. దేశభక్తితో, జాతి సమగ్రతకు నిలబడాలనే విశాలమైన దృక్పథంతో ముందుకు వచ్చిందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశం సోమవారం జరిగింది.

జనసేన సిద్ధాంతాలు బలపడుతున్నాయి:- జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావజాలం దేశంలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. దేశం కోసం ఆలోచించే పార్టీ విధానం అందరికీ పార్టీని దగ్గర చేస్తోంది. దీని ఫలితమే కర్ణాటక, కేరళం, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి పార్టీలో చేరేందుకు, ఆయా ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తరించేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ఎప్పటికీ జనసేన పార్టీ తొలి ప్రాధాన్యం దేశం మాత్రమే. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడటమే పార్టీ మూల సిద్ధాంతం.

18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు:- దేశ విభజన సమయంలో సుమారు 2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.బ్రిటీషు వారు వెళ్తూ వెళ్తూ దేశాన్ని కల్లోలితం చేశారు. మత ప్రాతిపదికన విభజించారు. 536 సంస్థానాలతో ఉన్న దేశాన్ని ఐక్యం చేయడానికి దేశ మొదటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ పడిన శ్రమ, ఆలోచన అమేయం. ఆయన చెప్పిన మాటను జనసేన పార్టీ అనుసరిస్తుంది. ఆచరిస్తుంది. నేటి రాజకీయాల్లో చాలామంది అధికారం కోసం దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారు. దీన్ని కచ్చితంగా జనసేన పార్టీ అడ్డుకుంటుంది.

దేశానికి చేటు తెచ్చే శక్తులపై రాజీ లేకుండా పోరాడుతాం:- జనసేన పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే విమర్శించాం. విభజన చేసిన తీరు ఈనాటికీ మానని గాయంగా ఉంది. అప్పట్లో సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించని తీరునే నేను పదేపదే ప్రస్తావిస్తాను. మొన్నటికి మొన్న తెలంగాణలో జనసేన ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వలేదు.

దక్షిణాదికి చెందిన కొందరు నాయకులు ఢిల్లీని మెడలు వంచుతాం.. వణికిస్తాం అని ప్రగల్భాలు పలుకుతారు. ఢిల్లీ రాగానే కనీసం నోరు కూడా పెగలదు. జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుంది. ఇలాంటి గొప్ప వేదికను దేశ ఐక్యత, సమగ్రత కోసం ఉపయోగించుకుంటాం.  

జెన్ జీ తరానికి దేశభక్తితో కూడిన విలువలను అందించాలి. అది మన బాధ్యత. ప్రాథమిక హక్కులు, విధులు వారికి తెలియజెప్పాలి. వచ్చే తరానికి నిజాయతీతో కూడిన రాజకీయాలు, నీతివంతమైన పాలన అంటే ఎలా ఉంటుందో జనసేన పార్టీ చూపిస్తుంది. వచ్చే తరాలు ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగితేనే దేశ గతి మరో దశకు వెళుతుంది. దేశానికి బలమైన పునాదులు వేయడంతో పార్టీ స్ఫూర్తివంతంగా పనిచేస్తుంది’’  అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *