ఆక్రమంగా చొరబడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిని వెలుపలికి పంపిస్తాం-హోం మంత్రి అమిత్ షా
అమరావతి: దేశంలోకి ఆక్రమంగా చొరబడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిని భారతదేశం వెలుపలికి పంపిస్తామని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారంనాడు జరిగిన సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ, అక్రమ వలసలతో దేశంలో డెమోగ్రాఫ్ ను మార్చేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.దేశ డెమోగ్రాఫిక్స్ ను సురక్షితంగా ఉంచేందుకు అక్రమ వలసదారులను ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరిని వెనక్కి పంపిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం దేశంలోని 6,000 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అభేద్యమైన భద్రతా గ్రిడ్‌ను అమలు చేస్తుందని చెప్పారు.
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో:- చొరబాటు, పశువుల అక్రమ రవాణా మార్గాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు, జిల్లా కలెక్టర్లు, గ్రామ అధికారులతో నేరుగా సమన్వయం చేసుకుంటూ తమ నిఘా వ్యవస్థను విస్తరించాలని BSFను కోరారు. బంగాల్, అసోం, త్రిపుర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటే ఈ భద్రతా వ్యవస్థను సులభతరం చేసుకోవచ్చని అన్నారు. ఈ విషయమై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోం మంత్రిత్వ శాఖ త్వరలో సమావేశం కానుందని వివరించారు. గతంలో ప్రకటించిన ఉన్నత స్థాయి జనాభా మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని తెలిపారు.
స్మార్ట్ బోర్టర్ కాన్సెప్ట్ కింద రాడార్లు, అడ్వాన్స్డ్ కెమెరాలతో BSFకు అధునాతన టెక్నాలజీని అందచేస్తామన్నారు. దేశభద్రత కోసం ఆహర్నిశలు పాటుపడుతున్న BSF సేవలను హోం మంత్రి ప్రశంసించారు. 1965లో BSF కేవలం 25 బెటాలియన్లతో ప్రారంభం కాగా నేడు 2,70,000 మందితో పటిష్టమైన దళంగా ఏర్పడిందని, ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా నిలిచిందన్నారు. సరిహద్దుల పటిష్టత విషయంలో BSF ఎప్పుడూ వెనుకంజ వేయలేదన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా శత్రువును చిత్తుచేస్తూ వచ్చారన్నారు.

