జల్ జీవన్ మిషన్ 2.0లో జల సంరక్షణకు ప్రాధాన్యం- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం..
భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం తప్పనిసరి..
అమరావతి: ‘జలమే జీవం…జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని, సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యలు నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.మంగళవారం‘ గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం’ వర్క్ షాపు ప్రారంభించి, ప్రసంగిస్తూ…భూమి మీద మనిషికి అవసరం అయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉంది.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగవడానికి గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులే జీవనాధారం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా దేశంలో ముందు వరుసలో ఉండటానికి మనకు సమృద్ధిగా ఉన్న నీటి వనరులే కారణం.
గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు ఎన్నో అవరోధాలు:- ప్రతి కుటుంబానికీ తగినంత తాగు నీరు అందించాలనే ఆశయానికి క్షేత్రస్థాయిలో ఎన్నో అవరోధాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తగినంతగా-ఉపరితలంలో లభించే నీరు లభ్యత లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం కీలకమైన సమస్యలుగా ఉన్నాయి.
నీటి సంరక్షణకు ప్రాధాన్యం:- ప్రతి కుటుంబానికి తగినంత తాగునీరు అందించాలనే బృహత్ సంకల్పంతో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్గదర్శకంలో నీటి పొదుపు చర్యలు తీసుకుంటాం. జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తాం.
100 రోజుల ప్రణాళికకు శ్రీకారం:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’’ అనే కార్యక్రమాన్ని ఈ ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు చేపట్టింది. దీనిలో ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ జలాల పెంపుదల, నీటి వృథాను అడ్డుకోవడం, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం వంటి చర్యలను తీసుకుంది.

