”స్వయం” పేరుతో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్-సీఎం చంద్రబాబు
అమరావతి: డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం “స్వయం” అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై బుధవారం సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు.. లోగోలను సీఎం పరిశీలించారు. అధికారులు ప్రతిపాదించిన రెండు లోగోలను పరిశీలించిన సీఎం… లోగో ఖరారుపై డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. మెజార్టీ అభిప్రాయం మేరకు లోగో ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా.. మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలి. బ్రాండ్ పేరు, లోగో ఆకట్టుకునేలా ఉండాలి. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి… స్వయం అనే పేరు బాగుంటుంది. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

