విశ్రాంత రవాణా శాఖ ఉద్యోగి ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం
అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి సన్నిహిత సహచరుడి బంధువు ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం పట్టుబడింది. ఆ మొత్తాన్ని లెక్కించడానికి యంత్రాలు కూడా సరిపోలేదు. మనీ కౌంటింగ్ మెషీన్స్ లో ఐదు పనిచేయకుండా పోయాయి. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో నివాసించే మీనార్ మొండల్ అనే విశ్రాంత బస్సు డ్రైవర్ నివాసంలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.28 కోట్ల నగదు, 15 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత:- పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.. తులు మొండల్ అనే శిలల వ్యాపారికి మీనార్ మొండల్ బంధువు. తులు మొండల్.. తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రత మొండల్‌కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో వీరు అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా, మొదట రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారం లభించాయి. ఆ తర్వాత తనిఖీలు కొనసాగించడంతో నగదు మొత్తం సుమారు రూ.28 కోట్లకు చేరింది.
రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగిగా పనిచేసిన మీనార్ మొండల్.. పదవీ విరమణ పొందాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అయితే.. ఇంత భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టాడనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగుతొంది. నిందితులకు కొందరు పేరున్న నాయకులతో సంబంధాలున్నాయంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, అక్రమ సంపద వెనకున్న వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

