కండలేరు జలాశయంలో 60 టీఎంసీలు-నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించండి-కలెక్టర్
నెల్లూరు: కండలేరు జలాశయం వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కండలేరు జలాశయ అధికారులను ఆదేశించారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భారీగా కురుస్తున్న వర్షాలకు కండలేరు జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో గురువారం కండలేరు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిశీలించారు. డ్యాం కెపాసిటీ, క్రస్ట్ గేట్లు, మోటారు పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 60 టీఎంసీల నీరు ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని ఎస్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర రావు కలెక్టర్ కు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదనీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కండలేరు సమీప గ్రామాల్లో రెవిన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఆర్డీవో అనూషకు సూచించారు. ప్రధానంగా పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం మండలాల్లోని గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బోట్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎస్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఆర్డీవో అనూష, పలువురు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

