రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాంఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని చెప్పారు. రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంగా చూడలేదని కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని తెలిపారు. అంశం ప్రాధాన్యతను బట్టి సవరణ విధానాలను పొందుపరిచారని అన్నారు. బడుగు వర్గాలకు, మహిళలకు విద్య అందించేందుకు జ్యోతిబాపులే, సావిత్రిబాయిపులే కృషి చేశారని అలానే జ్యోతిబాపులేను అంబేడ్కర్ తన గురువుగా భావించేవారని జస్టిస్ గవాయ్ తెలిపారు.
ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం: కొన్ని అంశాల్లో సవరణ సులభమని కాని మరి కొన్ని అంశాల్లో చాలా కఠినమని జస్టిస్ గవాయ్ చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ చేసుకున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని అన్నారు. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. 1975 వరకు ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని కాని కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని జస్టిస్ గవాయ్ వివరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం ఉండాలన్నది నా అభిప్రాయమని పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపారు. కొన్నేళ్లుగా మహిళలు న్యాయ విద్యలో బాగా రాణిస్తున్నారని అలానే రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.

