అగ్నిప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి-పవన్ కళ్యాణ్
అగ్నిప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులు..
బాధితులకు తక్షణ సాయం, నష్టపరిహారం..
250 నుంచి 300 వరకు వలలు దగ్ధం..
ఘటనపై కలెక్టర్‌ను వివరాలు అడిగిన డిప్యూటీ సీఎం..
అమరావతి: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు దగ్ధం కావడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు తమ వలలను షెడ్లలో భద్రపరచగా, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 250 నుంచి 300 వలలు పూర్తిగా దగ్ధమైనట్లు కలెక్టర్ వివరించారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2.0 పథకం కింద:- ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా ఇప్పటికే వేట విరామం కొనసాగుతున్న నేపథ్యంలో వలలు కూడా కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు వెంటనే నిత్యావసర సరుకులు అందించాలని, నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2.0 పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. వలలు కోల్పోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

