ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ ‘పరివర్తన రాజనీతి పార్టీ’
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ వేదిక...
అమరావతి: మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో నూతన రాజకీయ పార్టీని బుధవారం ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ వేదికగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండా, అజెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.
ముఖ్యమంత్రిని చేస్తా:- తాను ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష లేదని స్పష్టం చేశారు. శక్తి, సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న యువతలో సమర్థుడైన నాయకుడిని గుర్తించి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు కుటుంబాలే పరిపాలించాలా? అని ప్రశ్నించారు. మంచి పని చేస్తే ఎవరైనా అభినందించాల్సిందేనని, తప్పు చేస్తే ఆధారాలతో ప్రశ్నించాల్సిందేనని విజయసాయిరెడ్డి అన్నారు. తాను చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసినా తప్పును తప్పుగానే ప్రశ్నించాలని పేర్కొన్నారు.

