AP&TG

ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు..

అడవిలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేయండి..

⁠కుంకీ ఏనుగులని రంగంలోకి..

పంట నష్టం జరిగిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు..

అమరావతి: చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును  అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి,అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం పడిపుట్లబైలు ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పరిసర గ్రామాల్లో మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో వ్యవసాయ పంటలకు నష్టం కలిగిస్తున్నట్టు రైతులు ఆవేదనలో ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏనుగుల గుంపు రహదారిని దాటి మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించగా, మరో రెండు ఏనుగులు కూడా రహదారి దాటి చిత్తూరు వైపు కదులుతున్నట్టు వివరించారు. ఈ ఏనుగుల సంచారం పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

వాటిని సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతాల వైపు మళ్లించే:- “ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలను పోలీసు, రెవెన్యూ, విద్యుత్, తత్సంబంధిత తదితర శాఖలు, హనుమాన్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలి. అలాగే, క్షేత్రస్థాయి బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రమాదానికి అవకాశం ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. సాధ్యమైన చోట ఏనుగుల కారణంగా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. వాటిని సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతాల వైపు మళ్లించే చర్యలు చేపట్టాలి. ప్రజల భద్రత, వ్యవసాయ పంటల పరిరక్షణ, మానవ–ఏనుగు ఘర్షణల నివారణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల”ని స్పష్టం చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *