ఆకాశాన్ని చూసి వర్షం వస్తుందో రాదో కచ్చితంగా చెప్పే ఖగోళ విజ్ఞానం మన సాహిత్యంలో ఉంది-బుద్దప్రసాద్
ప్రాచీన తెలుగు సాహిత్యంపై రెండు రోజుల జాతీయ సదస్సు..
భారతీయ సాహిత్య వైభవం.. విజ్ఞాన భాండాగారం..
ప్రాచీన కావ్యాల్లో ఖగోళం, గణితం, మానసిక విజ్ఞానం..
అమరావతి: సాహిత్యం కేవలం కల్పనకో, రసానుభూతికో పరిమితం కాదని, ప్రకృతి రహస్యాల నుంచి పంచభూతాల వరకు సకల శాస్త్ర విజ్ఞానాన్ని భావి తరాలకు అందించిన సజీవ ప్రవాహమని పలువురు సాహిత్యవేత్తలు పేర్కొన్నారు. విజయవాడలోని కేబీఎన్ కళాశాల, నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగనున్న ‘ప్రాచీన తెలుగు సాహిత్యంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం’ జాతీయ సదస్సు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఖగోళ శాస్త్రం మొదలుకుని ఆధునిక మానసిక శాస్త్రం, ఆయుర్వేదం, గణితం, ఇంజనీరింగ్, విపత్తుల నిర్వహణ వరకు మన ప్రాచీన కావ్యాల్లో నిక్షిప్తమైన వైజ్ఞానిక సంపదను సాహితీవేత్తలు ఈ వేదికగా అద్భుతంగా ఆవిష్కరించారు.
ఆకాశాన్ని చూసి వర్షం వస్తుందో రాదో:- ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచానికి జ్ఞాన దృష్టిని అందించిన భారతదేశం.. వేదకాలం నుంచే సమస్త విజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందించే ప్రయత్నం చేసిందన్నారు. జానపద సాహిత్యం కూడా పామరులకు జ్ఞానాన్ని పంచిందని, నన్నయ్య కాలం నాటి నుంచి మన తెలుగు సాహిత్యం కేవలం భక్తి తత్వానికే పరిమితం కాకుండా సమస్త శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందించిందన్నారు. అధునాతన శాస్త్ర పరికరాలు లేని ప్రాచీనకాలంలో నక్షత్రాలను, ఆకాశాన్ని చూసి వర్షం వస్తుందో రాదో కచ్చితంగా చెప్పే ఖగోళ విజ్ఞానం మన సాహిత్యంలో ఉందని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’, మహాభారత, రామాయణాల ద్వారా పరిపాలకులు ఎలా ఉండాలో స్పష్టమైన రాజనీతిని తెలుసుకోవచ్చన్నారు. ప్రపంచంలో మొదటిగా విమానాన్ని నడిపింది రావణాసురుడు అనే విషయంలో పరిశోధన చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం ఓ కమిటీని నియమించటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
తెలుగు సాహిత్యంలోని విభిన్న కోణాలు:- జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జునరావు మాట్లాడుతూ, సాహిత్యంలో చెప్పిన విషయాన్ని సరిగ్గా బేరీజు వేసుకోవాలని; తులనాత్మక అధ్యయనం చేయాలని సూచించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలోని విభిన్న కోణాల అధ్యయనం ద్వారా సాహిత్య పరిశోధనల్లో నూతన అంశాలు ఆవిష్కృతమవుతాయన్నారు. తెలుగు భాషా పరిరక్షణ, పరిశోధన రంగాల్లో ప్రాచీన కేంద్రం చేస్తున్న కృషిని వివరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ టి.శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ జి.నాగరాజు, సదస్సు సమన్వయకర్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. అనంతరం జరిగిన సదస్సుల్లో ఆచార్య సాగి కమలాకరశర్మ (ఉస్మానియా యూనివర్శిటీ), కస్తూరి మురళీకృష్ణ, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, డాక్టర్ ప్రఖ్య సత్యనారాయణ శర్మ, మోదుగుల రవికృష్ణ, డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ, తదితర ప్రముఖ సాహితీవేత్తలు ప్రసంగించారు.

