చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం-కలెక్టర్ హిమాన్షు శుక్ల
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు మెండు..
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తాం..
అవకాశాలను సృష్టించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..
MSME వర్క్‌షాప్‌కు విశేష స్పందన..
నెల్లూరు: చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి సరైన ఉత్పత్తి ఎంపిక, ఆధునిక సాంకేతికత, ప్రాజెక్టు ఫైనాన్సింగ్, డిజిటైజేషన్, ఈ-కామర్స్–డిజిటల్ మార్కెటింగ్ అనే ఐదు అంశాలు కీలకమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
పరిశ్రమల స్థాపనకు:- కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ డెస్క్, బ్యాంకుల స్టాల్స్, ఉద్యమ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక డెస్క్ లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, సబ్సిడీలు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులపై అధికారులు అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ రంగ నిపుణులు రుణాల మంజూరు, ప్రాజెక్టు నివేదికలు, వడ్డీ రేట్లు, రుణాల తిరిగి చెల్లింపు విధానాలపై ఔత్సాహికులకు వివరించారు.
వెల్డింగ్ రాడ్లు, ఆక్సిజన్:- జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణంతో వెల్డింగ్ రాడ్లు, ఆక్సిజన్, జేసీబీలు, వివిధ నిర్మాణ సేవలకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. రిఫైనరీ పూర్తయిన అనంతరం లభించే పెట్రోకెమికల్ ఉత్పత్తులను వినియోగించి వైర్లు, స్విచ్‌బోర్డులు తదితర తుది ఉత్పత్తుల తయారీకి అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
ఆన్‌లైన్ విక్రయాల ద్వారా:- ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, ఈ-కామర్స్ వేదికలను వినియోగించుకుని ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌కు చేరువ చేయాలని సూచించారు. ఆన్‌లైన్ విక్రయాల ద్వారా విస్తృత మార్కెట్‌ను అందిపుచ్చుకోవడంతో పాటు వ్యాపార నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.
ప్రభుత్వం రుణాలు:- జిల్లాలో రాబోయే రోజుల్లో ఏర్పడనున్న పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త అవకాశాలను గుర్తించి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం రుణాలు, సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు, హ్యాండ్‌హోల్డింగ్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. వర్క్ షాప్‌లో పాల్గొన్న ఔత్సాహికులు నిపుణులు, సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.

