మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 పరీక్ష విజయవంతం
అమరావతి: భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి “మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-4’ను గురువారం విజయవంతంగా ప్రయోగించిందని రక్షణ శాఖ తెలిపింది.
భారత క్షిపణి సాంకేతికత మరోసారి:- స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా చేరుకొని అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రమాణాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగం అనంతరం అగ్ని-4 నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవడంతో భారత క్షిపణి సాంకేతికత మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. ఈ విజయంతో దేశీయ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
3,000 కిలోమీటర్లకు పైగా పరిధిలో నోటమ్:- ఈ ప్రయోగానికి ముందు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ 3,000 కిలోమీటర్లకు పైగా పరిధిలో NOTAM (Notice to Air Missions) ఆంక్షలను అమలు చేసింది. దీంతో ప్రయోగం అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య విజయవంతంగా నిర్వహించబడింది. అగ్ని శ్రేణికి చెందిన క్షిపణులు భారత వ్యూహాత్మక నిరోధక సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అగ్ని-4 పరీక్షతో భారత రక్షణ పరిశోధన, క్షిపణి అభివృద్ధి రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది.

