నగరంలో 6 ఏసీ బస్సు స్టాప్స్ ను త్వరలోనే ప్రారంభిస్తాం-మంత్రి నారాయణ
నెల్లూరు: గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన అన్ని పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసి నెల్లూరు నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. శనివారం 9వ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పార్కులు, ప్రాథమిక పాఠశాల, రేబాల చిన్నపిల్లల ఆసుపత్రి భవనాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగరంలోని అన్ని పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దామని, ప్లే, జిమ్ ఎక్విప్‌మెంటు ఏర్పాటుచేశామని చెప్పారు. జూన్ 12లోగా నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో ప్లే, జిమ్ ఎక్విప్‌మెంటు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.. వేసవిలో నెల్లూరు నగర ప్రయాణికులు చల్లగా సేదతీరేందుకు తమ ప్రభుత్వ హయాంలో 6 ఏసీ బస్టాండ్లను ఏర్పాటు చేశామని, అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్వాకంతో ఈ బస్టాండ్లకు తాళాలు వేసిందన్నారు. త్వరలోనే ఏసీ బస్టాండ్లను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పెండిరగ్ పనుల పూర్తికి త్వరలోనే 165 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు చెప్పారు. నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయం వద్ద ఘాట్ పనులను కూడా దేవాదాయశాఖ మంత్రి ఆనంతో కలిసి పరిశీలించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, అడిషనల్ కమిషనర్ నందన్, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.