6 వేల మంది టిడ్కో గృహాలు అందుకున్న వారు గృహప్రవేశాలు చేయండి-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో టిడ్కో గృహాల తాళాలు అందుకున్న లబ్ధిదారులంతా ఈనెల చివరి నాటికి గృహప్రవేశాలు చేయాలని కమిషనర్ సూర్య తేజ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వివరాలను తెలియజేస్తూ టిడ్కో గృహాల ప్రాంగణాలలో నూతనంగా వీధి దీపాలను ఏర్పాటు చేశామని, పారిశుద్ధ్య కార్మికులకు నిరంతరం విధులు కేటాయించి ప్రాంగణాలన్నిటిని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దామని ప్రకటించారు. సుమారు 6 వేల మంది తాళాలు అందుకున్న గృహాల లబ్ధిదారులు ఇంకను గృహప్రవేశాలు చేయలేదని, వారంతా గృహాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటే అన్ని మౌలిక వసతులు, రక్షణ చర్యలు కల్పించే పనులను మరింత వేగవంతం చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. గృహాలు అందుకున్న యజమానులు అందరూ వీలున్నంత త్వరగా తమకు కేటాయించిన ఇండ్లలో ప్రవేశం చేసి సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని కమిషనర్ ఆకాంక్షించారు.