రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని భక్తిశ్రద్ధలతో అభివృద్ధి చేస్తున్నాం-మంత్రి ఆనం
ఆలయ మహా కుంభాభిషేకంలో..
నెల్లూరు: రాష్ట్రంలోని ఆలయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగి ప్రతి ఆలయం కూడా ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లేలా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం మహా కుంభాభిషేక కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆలయ పునర్నిర్మాణం, నూతన విగ్రహ ప్రతిష్ట, ధ్వజప్రతిష్ట శిలాఫలకాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రారంభించారు.
రూ.50 లక్షలతో పనులు పూర్తి చేశాం:- ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ విరువూరులో పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని తెలిపారు. దేవాదాయశాఖ కామన్‌గుడ్ ఫండ్ నుంచి రూ.40 లక్షలు, దాతలు మరియు ఆలయ కమిటీ సభ్యుల నుంచి రూ.10 లక్షలు సమకూర్చి మొత్తం రూ.50 లక్షలతో పనులు పూర్తి చేశామని చెప్పారు. ఆలయ అంతరాలయం, గర్భగుడి నిర్మాణాలను పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 600కు పైగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం జరుగుతోందని చెప్పారు. అలాగే టిటిడి ఆధ్వర్యంలో రాబోయే రెండేళ్లలో 5వేల కొత్త ఆలయాల నిర్మాణానికి రూ.750 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం ప్రాంతంలోని శ్రీ విశ్వేశ్వరస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధికి కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వివరించారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దేవాదాయశాఖ ఇంజనీర్లు, స్థపతులతో కలిసి మిగిలిన నిర్మాణాలపై ప్రణాళికలు సిద్ధం చేసి పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

